14, సెప్టెంబర్ 2024, శనివారం

🌺 అశౌచ సమయే వివాహ విషయః

నిశ్చితార్థం అయిన తర్వాత తల్లిదండ్రుల మరణం సంభవిస్తే వివాహం చేయవచ్చా? సంవత్సర సూతకంలో వివాహం చేయవచ్చా? ఎప్పుడు చేయాలి?

॥శ్లో॥ పితుర్మాతుశ్చ పత్న్యాశ్చ వర్షమర్ధంతదర్ధకమ్।
సుతభ్రాత్రోస్సార్ధ మాసమన్యేషామ్మాససమ్మితమ్।। 

తదన్తే శాన్తింకృత్వా యథోక్తవిధినాతతః। పునశ్చైవాథవాగ్దానం కృత్వాలగ్నం విధీయతే।।

వివాహమునకు నిశ్చితార్థం అయిన తర్వాత తండ్రి మృతినొందిన ఎడల సంవత్సరము, తల్లి మృతికి ఆరుమాసములు, భార్య మృతికి మూడు మాసములు, కుమారుడు-సోదరుడు మృతినొందిన 45 దినములు ఆగి తరువాత *వినాయకశాంతి* చేసి తిరిగి వాగ్దానము-నిశ్చితార్థము చేసి, సుముహూర్తము నిశ్చయించి, వివాహము చేయవలెను.

శ్లో॥ అన్యేషాం సపిండానాం మాసమేకముదాహృతమ్।
ఉక్తకాలావధిర్యావత్తావన్నైవ శుభక్రియా॥ 

సపిండులకు ఒక మాసం అసౌచము ఉంటుంది. పై విధంగా మాతాపిత్రాదులు మృతినొందినప్పుడు, పుత్రాదులకు పైన చెప్పబడినంతకాలము అశౌచము ఉంటుంది, కాబట్టి అంతకాలము శుభ కర్మలు  చేయకూడదు. 

👉 ఇందులకు అపవాదు

మాతా పితౄణాం ప్రథమాబ్దమధ్యే యద్యుత్సవ స్సోపి శుభం నకుర్యాత్। 
ఊనం నకుర్యాద్యదివా విమోకం నైవాబ్దికం యావదధోశుభంచేత్॥ 

వివాహాది ప్రకుర్వీత యదా మహతిసంకటే। 
సపిండీకరణాదూర్ధ్వం మాసికాన్యపకృష్యచ॥ 

కన్యాశ్చాతికాలశ్చే ద్వరస్యాపి భవేద్యది। 
తస్యోద్వాహేనదోషోస్తి తథాచైవోపనాయనే॥

తల్లిదండ్రులు మరణించినప్పుడు సంవత్సరంలోపు శుభ కార్యములు ఉత్సవములు నిర్వహించకూడదు.

వటువుకు ఉపనయన కాలాతిక్రమణమందున్నూ, కన్యకు వివాహ కాలాతిక్రమణమందున్నూ, వరునకు కాలాతిక్రమణ కష్టకాలమందున్నూ, స పిండి కరణము తరువాత రాబోవు మాసికములను అపకర్షచే నాచరించి వివాహ ఉపనయనములను చేయవలయును దోషము లేదు.

పూర్వము కన్యకు ఎనిమిది సంవత్సరాలకే వివాహం చేసేవారు. రజస్వల అయిన తర్వాత వివాహం చేయడం ఉండేది కాదు. కావున అతిక్రమము అంటే ఈ కాలం దాటిపోతుంది అనే సంకోచం ఉన్నప్పుడు పైవిధంగా చేయవచ్చు. 

నేటి కాలంలో చేసే వివాహాలు వధూవరులకు 25 సంవత్సరాలు దాటిన తర్వాతే చేస్తున్నారు. కనుక వీటి విషయంలో కాలం అతిక్రమణ అవుతోంది అనే భావన ఉండదు గనుక,  అశౌచం ఉన్నంతకాలము వదిలిపెట్టడమే శ్రేయస్కరం. 

లేదా పెద్ద ప్రాణ సంకటం కలిగినప్పుడు, సంవత్సరంలోప వివాహం చేయడంలో దోషము లేదు అని భావించవచ్చు. 

10, సెప్టెంబర్ 2024, మంగళవారం

🌺 గృహం లో వాస్తు వేధ దోషాలు తెలుసుకొనుట ఎలా...!!

వేధలు అంటే కనిపించకుండా బాధించే వాస్తు దోషాలు. వేధల్లో కొన్ని సహజమైన ప్రకృతి సంబంధమైనవి. మరికొన్ని సామాజిక మైనవి.
కుడ్య వేధ: ఇల్లు కడుతూ ఉన్నప్పుడు తూర్పు ఉత్తరం ప్రహరీ గోడలు కాని ఇతరమైన గోడలు కాని పడమర, దక్షిణ దిశలకన్నా ఎత్తుగా ఉండకూడదు. అంటే పడమర దక్షిణ దిశల గోడలు ఎత్తుగా ఉండాలి.

తారతమ్య వేధ: ఇంట్లో ఎప్పుడూ దక్షిణ పడమరల వైపు పెద్దవారు నివసించాలి. తూర్పు ఉత్తరముల వైపు చిన్నవారు వుండాలి. అలా కాకుండా వ్యత్యస్తంగా అయినప్పుడు తారతమ్య వేధా దోషం కలుగుతుంది.

నత వేధ: ఇంటి ఆవరణలో తూర్పు ఉత్తర భాగములు ఎత్తుగాను, పశ్చిమ దక్షిణములు పల్లముగాను ఉండుట వలన నత వేధా దోషం కలుగుతుంది. దాని వలన చోర బాధలు, ఆకస్మిక ప్రమాదాలు సంభవిస్తాయి.

కాంతి హీన వేధ: ఇంటిలోకి మొదటి, నాలుగు జాములో సూర్యరశ్మి సోకాలి. లేకపోతే కాంతి హీన వేధ దోషం కారణంగా భూత బాధలు పీడిస్తాయి.

క్షౌద్ర వేధ: ఇంట్లో ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ దిశల్లో పుట్టలు (చీమల పుట్టలు-పాముపుట్టలు) అదేపనిగా తేనె పట్టులు పెడుతూ ఉండడం మంచిది కాదు. అలా జరిగిన సందర్భాలలో కొన్ని నిర్మాణాలు అకస్మాత్తుగా భూమిలో కృంగిపోయిన సందర్భాలున్నాయి. దానినే క్షౌద్ర వేధ అంటారు.

పశు వేధ: ఇంటి ఆవరణలో ముందు భాగంలో పశువులు, గొర్రెలు, మేకలు వంటివి ఉండకూడదు. ఇంటి పశ్చిమ, దక్షిణ భాగాలలో ఉండాలి. గోవులైతే ఉత్తర ఈశాన్య భాగాలు శ్రేష్టం. గోవుయొక్క గిట్టల ధూళి వలన ఎన్నో దోషాలు పరిహారమవుతాయి. గోవు గురించి వేద విజ్ఞానం కాని హిందూ మత విశ్వాసం కాని, కేవలం విశ్వాసం కాదు-అది కేవలం విజ్ఞాన ప్రధానమూ మానవ శ్రేయస్సుకూ సంబంధించిన సత్సంప్రదాయం.

కోణ దృగ్వేధ: ఇంటి స్థలంలో ఒక మూలగా ఇల్లు కట్టకూడదు. ఒకవేళ తప్పనిసరి ఐన పక్షంలో దానికి ప్రత్యేక ప్రహరీ నిర్మాణం చేయాలి. అలాగే ఇతరుల ఇంటి మూల ఇంటి గృహ ద్వారాన్ని ఛేదించకూడదు. ఇంటి యొక్క మూలల వెంబడి ద్వారాలు ఉంచడం కూడా కోణ వేధగానే బాధిస్తుంది. ఈ కోణ వేధనే కొన్ని ప్రాంతాలలో ‘కొంజెర’ దోషం అని గ్రామీణ పద్ధతిలో పిలుస్తారు.

శైలవేధ: ఇంటికెదురుగా సింహ ద్వారానికెదురుగా కొండలు, గుట్టలూ ఉండకూడదు. ముఖ్యంగా తూర్పు ఉత్తర దిశలలో కొండలు, గుట్టలూ అసలు ఉండకూడదు. ఇంటి గోడల చివర్లలో కోట గోడల ఆకారంలో ఆర్చిలు కాని , కమాన్లు కానీ ఉండకూడదు. ఇల్లు నిర్మించే స్థలం కోణాకృతిలో ఉండకూడదు.

సత్రవేధ: ఇంటికి ఎదురుగా గాని సమీపంలో కాని రెండువందల గజాలలోపు సన్యాసాశ్రమాలు, అనాధాశ్రమాలు, ఆలయాలు ఉండకూడదు.

శల్యవేధ: శల్యములు అంటే ఎముకలు. ఇల్లు కట్టే స్థలం ముందుగా ఒక మనిషి నిలువు తవ్వి ఎముకలు, బొగ్గులు, ఊక వంటి నిషిద్ధ పదార్థాలు లేకుండా చూసుకోవాలి. ఇల్లు కట్టే స్థలంలో గర్భంలో గండశిల వంటివి ఉండకూడదు. అవి ఇంటిని కదిలిస్తాయి. హాని కలిగిస్తాయి.

కుల్యములు, అంటే కాలువలు, తటాకము అంటే చెరువులు, ప్రవాహాలు, ఇవి ముఖ్యంగా నైరుతి, వాయవ్యాలుగా కాని, ఈశాన్యము నుండి ఆగ్నేయముల వైపు కాని, దక్షిణ పడమరలుగా గాని ప్రవహించకుండా చూసుకోవాలి.

ఇంట్లో నీరు కూడా ఈశాన్యం వైపు పారేలా ఏర్పరుచుకోవాలి. ఇతరుల ఇంటి నీరు మన ఇంటి ఆవరణలోకి రాకుండా చూసుకోవాలి.ఈ వాస్తు నియమాలు చదివినప్పుడు, చెబుతున్నప్పుడు కఠినంగానే వినిపిస్తాయి. కాని కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ఇబ్బందులు రాకుండా కాపాడతాయి.

స్తంభహీన వేధ:-స్తంభహీన వేధని ‘శంఖపాల వేధ’ అని కూడా అంటారు. స్తంభములు (పిల్లర్లు) లేకుండా గృహ నిర్మాణము చేయకూడదు. స్తంభము అంటే స్థిరంగా నిలబడి యుండునది అని అర్థం. స్తంభములు వాస్తురీత్యా సరియైన సంఖ్యలో సరియైన పద్ధతిలో ఏర్పాటుచేస్తే ఆ ఇల్లు కూడా స్థిరంగా సుస్థిరంగా ఉంటుంది. స్తంభములు లేకుండా ఇల్లు నిర్మించరాదు. దానినే స్తంభహీన వేధ - శంఖపాల వేధ అంటారు. ఆ స్తంభాలు, సున్నాలేని సరిసంఖ్యలో ఉంటే చాలా క్షేమం. షోడశ సంఖ్యలో ఉంటే అంటే పదహారు సంఖ్యలో ఉంటే అత్యంత ఉత్తమం.

వికట వేధ: వికటము - అంటే వంకర. గృహము యొక్క సింహ ద్వారము విషయంలో చెప్పబడింది. ‘వికటే సంతాన వేధ స్యాత్’ వికట వేధ వలన సంతానమునకు హాని. సింహద్వార ప్రమాణం వంకరగా ఉన్నా - కొలతలు (ఆయము - మిగతా ద్వారముల సమన్వయ ప్రమాణముతో) హెచ్చుతగ్గులు మిట్ట పల్లాలు - సంకరమైన కలప - నిషేధితమైన కలప (తుమ్మ మొదలైనవి)తో చేయబడినా రెండు ద్వారముగా లేక ఒకే ద్వారము కలిగి ఉన్నా మరొకరి ఇంటిలోది కొని తెచ్చిపెట్టినా.. రూపహీనంగా ఉన్నా ఆ ఇల్లు వికట వేధ కలిగిన ఇల్లుగా చెప్పవచ్చు. అందుకే వికట వేధ లేకుండా సింహ ద్వార నిర్మాణం చేయించాలి.

వృక్ష ఛాయ వేధ ;-వృక్ష ఛాయ కూడా వేధగానే పరిణమిస్తుంది. దిన సమయంలో గాని రాత్రి సమయంలో గాని రెండు మూడు ఝాముల వేళల్లో కాండము గల చెట్టుయొక్క నీడలు ఇంట్లో కాని ఇంటి మీద కాని పడకూడదు.

తూర్పున మర్రి, ఆగ్నేయంలో వేప, జామ దక్షిణంలో తెల్ల జిల్లేడు, అల్ల నేరేడు, పనస - నైరుతిలో శమీ వృక్షం - పడమర రావి చెట్టు ఉసిరిక చెట్లు - వాయవ్యంలో మేడి ఉత్తరంలో వెలగ - పనస. ఈశాన్యంలో మారేడు చెట్లు ఉంటే రక్షగా ఉంటాయి.

అగ్నివేధ: ఇంటిలో ఆవరణలోగాని ఇంటి సమీపంలో గాని చెత్త లాంటివి తగులబెట్టవలసి వస్తే అది ఇంటికి ఆగ్నేయ భాగంలో వచ్చేట్టు చూడాలి. ఆగ్నేయ భాగంలోకాక మరే దిశలోనైనా నిప్పు వెలగటం వల్ల ఆ ఇంటికి అగ్ని వేధా దోషం కలుగుతుంది. దాని వలన భార్యాపుత్రులకు హాని కలిగే అవకాశం ఉంది.

దహన వేధ: ఏదైనా ప్రమాదవశాత్తు ఇంటికి సంబంధించిన తలుపులు కాని కిటికీలు కాని పాక్షికంగా కాని పూర్తిగా కాని అగ్నిప్రమాదానికి గురైతే వాటిని వెంటనే తొలగించి కొత్తవి ఏర్పాటు చేసుకోవాలి. సగం కాలినవే కదా అని ఉపేక్షించరాదు.దాని వలన దహన వేధా దోషం తగులుతుంది. అలాగే ఇంట్లో పగిలిన అద్దాలు రెండు రూపాలుగా కనిపించే అద్దాలు, విరిగిన తలుపులు కలిగిన కిటికీలు ఉండరాదు. తలుపులు కాని, కిటికీలు కాని అదే పనిగా కిర్రుమనే శబ్దాలు కాని కీచుమనే శబ్దాలు కాని సృష్టించకూడదు. కోడు, కాళ్లు విరిగిన కుర్చీలు, బల్లలు వాడుకలో ఉంచకూడదు. వాటి వలన వేధా దోషమే కాకుండా, ప్రమాద బాధలు కూడా కలుగుతాయి. సహజంగా పేదవారు అక్కడా ఇక్కడా దొరికిన కలపతో గుడిసెలు, ఇళ్లు ఏర్పరచుకుంటారు. అందులో కాలిన వస్తువులు ఉండకూడదు. నట్టింట్లో బొగ్గులు ఉంచకూడదు. తాత్కాలికంగానైనా పోయకూడదు.

చతుష్కోణ వేధ: సహజంగా ఇల్లు కట్టే సమయంలో సమ చతురస్రంగా ఉండాలనే ఉద్దేశంతో నిర్మిస్తారు. ఆ సంబంధంగా నాలుగు భిన్న కోణాలు ఏర్పడతాయి. దాని వలన చతుష్కోణములుగా మూలలను వేధిస్తాయి. అది మంచిది కాదు.

రక్త వర్ణ వేధ: ఇంటికి వేసే రంగుల విషయంలో, ఫ్లోరింగ్ విషయంలో రక్త వర్ణం గల రంగును వాడకూడదు.

వాయు వేధ: ఇంటికి దక్షిణ, పడమర దిశలలో తప్పకుండా కిటికీలు ఉండాలి. దక్షిణ దిశ నుండి మలయ పర్వతం గాలులు, పడమటి వైపు నుండి పడమటి కనుమలల గాలులు వైద్య శాస్తర్రీత్యా చాలా ఆరోగ్యకరమైనవి.మలయ పర్వతాలే నల్లమల కొండలు. అక్కడ నుండి వచ్చే గాలులకే మలయానిలం అని పేరు. అందుకే దక్షిణ, పడమరలకు, ఇంటికి కిటికీలు ఉండాలని మన వాస్తు శాస్త్రం నిర్దేశించింది.

స్మశాన వేధ: ఇంటికి దగ్గరలో స్మశానం ఉండటం మంచిది కాదు. శవ దహనం చేసిన పొగను ప్రేత ధూమమంటారు. అది పారటం ఇంటిపైన కాని వ్యక్తిపైన కాని మంచిది కాదు.
గృహానికి ఆగ్నేయ, నైరుతి దిశలందు తూర్పు పడమరలలోనూ గోతులూ విపరీతమైన పల్లపు ప్రదేశమూ ఉండకూడదు.

ఉచ్చిష్ట వేధ: గృహావరణలో తూర్పు, ఉత్తర దిశలలో పెంటకుప్పలూ - ఉమ్ములూ, పేడకుప్పలూ, చెత్తకుప్పలూ ఉండకూడదు. ఈశాన్య దిశగా ఎప్పుడూ ఉమ్మివేయటం కానీ, మల మూత్ర విసర్జనలు కాని పనికి రావు. ఈ నియమం ఇంటికి మాత్రమే కాదు. బయటకు కూడా వర్తిస్తుంది. అలాగే సూర్యుడికి ఎదురుగా మల మూత్రాదులు చేయకూడదు. సూర్యుడు ఉన్న దిశ నుండి వ్యతిరేక దిశలో ఆగ్నేయ నైరుతి భాగాలను ఉపయోగించాలి.

భిన్నదేహళీవేధ: ‘దేహళి’ అంటే ‘కడప’ ద్వారం దాటడానికి వేసే ‘నడిమి పడిని’ కడప అంటారు. కడప పట్టణానికి ఆ పేరు రావడానికి అది తిరుపతి వెంకటేశ్వరస్వామి యొక్క దేవుని కడప కావటమే. ఈ గడపను తొక్కుతూ ఇంట్లోకి కాని, దేవాలయంలోకి కాని వెళ్లకూడదు. దాటుతూ వెళ్లాలి. ఈ కడపను ద్వార ప్రమాణానికి అనుప్రమాణ రీతిలో నిర్మించాలి. అలా కాకుండా నిర్మిస్తే అది దేహళీ భిన్న వేధగా ఇంట్లో నివసించే వారికి అనేక రకములైన ఇబ్బందులకు గురి చేస్తుంది.

🌺 అముక్తాభరణ సంతాన సప్తమీ వ్రతం

సంతాన ప్రాప్తికి, సంతాన క్షేమం కొరకు ఈ వ్రతాన్ని ఆచరించాలి. దీనిని ఆచరించేవారు, పగలంతా ఉపవసించి, సాయంత్రం గౌరీపరమేశ్వరులను గంధము, పుష్ప, ధూప, దీప, నైవేద్యాదులతో ఆరాధించాలి. ఆవుపాలు, బెల్లముతో వండిన పిండివంటలు నైవేద్యముగా పెట్టి తాంబూలమును కూడా సమర్పించాలి. పూజా సమయంలో ఒక ఎర్రని రంగులోనున్న తోరమును దేవుని వద్ద నుంచి పూజించి , వ్రతము పూర్తయ్యాక దానిని తీసి ధరించాలి.

9, సెప్టెంబర్ 2024, సోమవారం

🌺 సోమవారం అమావాస్య


సోమవారం + అమావాస్య కలిసే రోజున ఆడవారు సౌభాగ్యం కోసం "అమాసోమవార వ్రతం"  చేసుకుంటారు. 
 ఇక ఆ సోమవారమూ, అమావాస్య కలసి వచ్చే రోజే ‘ సోమవతీ అమావాస్య ’. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు.

సోమవారం రోజున తెల్లవారు ఝామున లేచి దేవాలయలంలో రావి చెట్టుకి ప్రదక్షిణ చేసి దీపారధన చేసి. చెట్టు మూలాన్నినిళ్ళతో తడిపి పద్మం ముగ్గు పెట్టి , చెట్టుకి గంధం కలిపిన నీలు పోస్తూ మొదటి ప్రదక్షిణ చేసుకోవాలి తరువాత 108 ప్రదక్షిణలు చేయాలి. 

 క్రింది  (మూలతో బ్రహ్మ... అనే) శ్లోకం చదువు కుంటూ ప్రదక్షిణ చేయాలి. నిత్య సౌభాగ్యవతిగ దీవించమని వేడుకోవాలి. తరువాత ముతయిదువులకి పండు తాంబూలం ఇవ్వాలి.

🥀 వ్రత కథ 🥀
అనగనగా ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.ఆ కూతురి వివాహాంలో సన్నికల్లు మీద కాలు తొక్కే వేళ వైధవ్యం ప్రాప్తిస్తుందని, ఆ బాలికను సప్తసముద్రాలకు అవతల ఉన్న చాకలి పోలి వద్దకు తీసుకువెడితే గండం గడుస్తుందని ఒక దైవజ్ఞుడు చెప్పడం వలన ఆ పిల్ల పెద్దన్న గారు చెల్లెల్ని తీసుకుని బయలుదేరాడు.

అన్నాచెల్లెళ్ళిద్దరు సముద్ర తీరం చేరి అక్కడున్న ఒక చెట్టు క్రిందనిలబడి, “సముద్రాలను దాటడమెలాగా?” అని దిగాలుపడి ఉండగా చెట్టుపై నుండి ఒక పండు వారి మద్యన పడింది.. అన్నాచెల్లెళ్ళిద్దరు ఆ పండుని తినడంతో వారి ఆకలి దప్పులిట్టే మాయమయ్యాయి. అనంతరం అదే చెట్టుమీదనుండి ఒక గండభేరుండ పక్షి దిగి వచ్చి వాళ్ళిద్దరిని తన వెన్నుమీద కూర్చోబెట్టుకుని సప్తసముద్రాల అవతల ఉన్న చాకలిపోలి వాకిట్లో దింపి ఎటొ ఎగిరిపోయింది.

అది మొదలు అన్నాచెల్లెళ్లు చాకలి పోలి వాకిలి తుడిచి ,కల్లాపి చల్లి క్రొత్త క్రొత్త ముగ్గులు పెడుతూ,దగ్గరలో ఉన్న ఓ చెట్టు తొర్రలో నివసించసాగారు.తను నిద్రలేచేసరికి తన వాకిలి కల్లాపుతోనూ,రకరకాల ముగ్గులతోనూ కళకళలాడుతుండటం చూసిన చాకలిపోలి అలా చేస్తున్నదెవరో కనిపెట్టాలని కాపుకాసి,ఒకనాడు అన్నాచెల్లెళ్ళను కనిపెట్టింది,”ఎవరు మీరు? నా వాకిలినెందుకు ఊడుస్తున్నారు ? మీకేం కావాలి ?” అని అడిగింది.అందుకు అన్నగారు తన చెల్లెలి విషయంలో దైవజ్ఞుడు చెప్పినది వినిపించి,ఆమెను వైధవ్యం నుండి తప్పించవలసిందిగా కోరాడు. చాకలిపోలి సమ్మతించి,తన ఏడుగురు కోడళ్లని పిలిచి,తాను తిరిగి వచ్చే లోపల ఇంట్లో ఎవరైనా చనిపోతే దహనం చేయకుండా శవాన్ని భద్రంగా ఉంచమని చెప్పి,ఆ అన్నాచెల్లెళ్లతో బయల్దేరింది.ఆమె దివ్యశక్తితో సప్తసముద్రాల్ని దాటి,వాళ్ల ఇంటికి చేరి పిల్లకి పెళ్ళి చేయమంది పోలి .పెళ్ళి జరుగుతుండగా దైవజ్ఞుడు చెప్పినట్లే పెళ్ళికొడుకు మరణించాడు. వెంటనే చాకలిపోలి తన సోమవతి అమావాస్య ఫలాన్ని ఆ శవానికి ధారపోసి అతనిని మళ్ళి బ్రతికించాడు.అది చూసి అందరు ఆశ్చర్యపోయారు.ఆమె నెంతగానో స్తోత్రం చేశారు.కాని తన నోము ఫలాన్ని ధారపోయడం వలన,ఇంటి వద్దనున్న ఆమె ఏడుగురు కొడుకులు మరణించారు.ఆ సంగతిని కనిపెట్టిన చాకలి పోలి అందరి దగ్గర సెలవు తీసుకుని తన ఇంటికి బయల్దేరింది. దార్లో కనిపించిన రావి చెట్టును చూసి,108 గువ్వరాళ్లని ఏరి పట్టుకుని ఆ చెట్తుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసింది.ఇక్కడిలా చెయ్యగానే,అక్కడ ఇంటి దగ్గర మృతి చెందిన ఆమె కుమారులు నిద్రలేచినట్లుగా లేచి కూర్చున్నారు.

పోలి ఇంటికి చేరాక,ఏడుగురు కోడళ్ళు ఆమె చుట్టూ చేరి,జరిగిన అద్బుతానన్ని చెప్పి అలా ఎందుకు జరిగిందో చెప్పమని కోరగా,చాకలిపోలి వారితో అదంతా సోమవతి అమావాస్య వ్రత ఫలమని అని చెప్పి వారి చేత ఆ వ్రతాన్నిఆచరింపచేసింది.

విధానం:
ఒకానొక అమావాస్యతో కూడిన సోమవారం నాడు నోమును ప్రారంభించాలి. అశ్వత్థ(రావి) వృక్షానికి నమస్కరించి దిగువ శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణం చెయ్యాలి.

శ్లోకం:
మూలతో బ్రహ్మరూపాయ మద్యతో విష్ణురూపిణే|
అగ్రత శ్శివరూపాయ వృక్షరాజాయతే నమ: || 
అలా ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పర్యాయం చొప్పున 108 సార్లు శ్లోకం చదువుతూ,నూట ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలి.చివర్లో ఒక పండోఫలమో చెట్టు మొదలులో ఉంచి నమస్కరించాలి. అలా 108 అమావాస్య సోమవారాలయ్యాక ఉద్యాపన చేసుకోవాలి.

ఉద్యాపన:
అలా 108 వ అమావాస్యా సోమవారం నాడు రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసిన తర్వాత,వృక్షమూలంలో భియ్యంతో మండపం ఏర్పరిచి శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహాలను ఆ మండపంలో ఉంచి ఆరాధించాలి. ముత్తయిదువలకు ఫలాలను వాయనదానమివ్వాలి.

🥀 మరొక కథ కూడా ఉంది 🥀

దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే! తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించివేసుకుంది.

సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమథగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడిచేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చినవారందరినీ చావచితకబాదాడు. శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగినశాస్తిని అనుభవించాడు.

నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారంనాడు అమావాస్య తిథి కూడా ఉన్నదనీ... ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు.

శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి... తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని ‘సోమవతి అమావాస్య’ పేరుతో పిలవడం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు.

సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇందుకోసం తలార స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ, జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించి, శివ స్తోత్రాలతో కొలిస్తే... సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచారామాలలో కానీ, రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట. ఏదీ కుదరకపోతే కనీసం శివపంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతున్నారు

🌺 యామము అంటే..


సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్న కాలాన్ని "దినము లేక పగలు" అని అంటారు. తిరిగి సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఉన్న కాలాన్ని "రాత్రి" అంటారు. 

ఈ పగలు రాత్రి రెండిటినీ కలిపి "అహోరాత్రము" అని పిలుస్తారు. 

పగటిని 4 భాగాలుగాను, రాత్రిని 4 భాగాలుగాను చేస్తే దానికే "యామము" అని పేరు. యామమునకు "ప్రహార, జాము" అని కూడా పేర్లు ఉంటాయి. 

(రాత్రి రెండవ ఝాములో, మూడవ ఝాములో అంటాముకదా..!)

ఒక రోజులో సరిగ్గా 24 గంటలే ఉంటే, ఒక యామమునకు 3 గంటల సమయం గా తీసుకోవచ్చు. 

కానీ వేద కాలమానం ప్రకారము, ఒక రోజుకు సరిగ్గా 24 గంటలు ఉండదు దానిలో మార్పులు ఉంటాయి. 

సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో తేడాలు ఉండడం వలన ఈ రాత్రి పగలు లేదా ఒక అహురాత్రం లేదా ఒక యామము యొక్క కాలమానం కూడా మారుతుంది.

మీ
R విజయ్ శర్మ 
పురోహితులు, జ్యోతిష్యులు
9000532563

గర్భవతి మరియు భర్త పాటించవలసిన నియమాలు

ధర్మశాస్త్ర గ్రంథాలైన ధర్మసింధు, నిర్ణయసింధు వంటి మూలాలను అనుసరించి,  గర్భిణీ మరియు గర్భిణీ పతి ధర్మాలను క్రింద వివరించడమైనది. గర్భిణీ ధర్మ...